బీజేపీతో తెగదెంపులు చేసుకోండి.. మద్దతిస్తాం: ఏఐఏడీఎంకేకు డీఎంకే ఆఫర్

  • బీజేపీతో పొత్తు తెంచుకుంటే ఏఐఏడీఎంకే ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతిస్తామని డీఎంకే ప్రతిపాదన
  • వీసీకే వంటి చిన్న పార్టీలకు మంత్రి పదవులు ఇవ్వాలన్నది డీఎంకే మరో షరతు
  • డీఎంకే-ఏఐఏడీఎంకే కూటమికి వామపక్షాల విముఖత.. విజయ్‌తోనే పొత్తుకు మొగ్గు
  • ఈ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయని ఎన్డీటీవీ కథనం  
తమిళనాడు రాజకీయాల్లో దశాబ్దాలుగా బద్ధ శత్రువులుగా ఉన్న ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే), ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే) ఏకమవుతాయని ఊహించడం కూడా కష్టమే. కానీ, నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే)ను అధికారానికి దూరం చేసేందుకు ఈ రెండు పార్టీలు అనూహ్యంగా చేతులు కలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. గవర్నర్ ఆర్.వి. అర్లేకర్‌కు, నటుడు విజయ్‌కు మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో ఈ కొత్త రాజకీయ సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి.

ఎన్డీటీవీ కథనం ప్రకారం ఏఐఏడీఎంకే నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుకు బయటి నుంచి మద్దతు ఇచ్చేందుకు డీఎంకే సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఇందుకు కొన్ని కీలకమైన షరతులు విధించినట్లు సమాచారం. అందులో ప్రధానమైన‌ది ఏఐఏడీఎంకే తన మిత్రపక్షమైన బీజేపీతో సంబంధాలు పూర్తిగా తెంచుకోవాలి. గత నెలలో జరిగిన ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయి. ఈ షరతుకు అంగీకరిస్తేనే పొత్తుపై చర్చలు ముందుకు సాగుతాయని డీఎంకే స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

ఈ ప్రతిపాదిత కూటమిలో తమ మిత్రపక్షాల ప్రయోజనాలను కాపాడేలా డీఎంకే మరిన్ని షరతులు పెట్టింది. విదుతలై చిరుతైగల్ కట్చి (వీసీకే) వంటి చిన్న పార్టీలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని డీఎంకే కోరుతోంది. వీసీకేకు రెండు సీట్లు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న విజయ్ కూడా వీసీకే మద్దతు కోరారు. అయితే, మంత్రి పదవి ఆఫర్‌తో వీసీకే తిరిగి డీఎంకే గూటికి చేరినట్లు తెలుస్తోంది. డీఎంకే-ఏఐఏడీఎంకే పొత్తుకు మద్దతిచ్చేలా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ)లను ఒప్పించే బాధ్యతను కూడా వీసీకే తీసుకున్నట్లు సమాచారం.

అయితే, ఈ అనూహ్య పొత్తుకు వామపక్షాలు సుముఖంగా లేవని తెలుస్తోంది. నాలుగు సీట్లున్న సీపీఎం, సీపీఐ పార్టీలు డీఎంకే-ఏఐఏడీఎంకే కూటమి కంటే విజయ్‌తోనే కలిసి నడిచేందుకు మొగ్గుచూపుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మెజారిటీ మార్క్ 118కి చేరువయ్యేందుకు కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే (మొత్తం 9 సీట్లు) మద్దతు కూడగట్టాలని విజయ్ మొదట ప్రయత్నించారు. కానీ, మారిన పరిస్థితులతో తమిళనాడు రాజకీయాలు ఉత్కంఠభరితంగా మారాయి.

DMK
AIADMK
Tamil Nadu politics
Vijay TVK
BJP alliance
Tamilaga Vetri Kazhagam
VIduthalai Chiruthaigal Katchi
CPI
CPM

More Telugu News